US and Iran peace talks: అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. యుద్ధ పరిస్థితులకు ముగింపు చెప్పే లక్ష్యంతో 14 ముఖ్యమైన క్లాజులతో కూడిన ఒక అవగాహన ఒప్పందం (MOU) దాదాపు సిద్ధమైందని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. శాంతి చర్చలు ముందుకు సాగుతుండటంతో అంతర్జాతీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన, ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలు క్రమబద్ధంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యే వరకు తాము ఎలాంటి తొందరపడటం లేదని స్పష్టం చేశారు.
అలాగే ఒప్పందం కుదిరే వరకు ఇరాన్‌పై విధించిన సముద్ర దిగ్బంధం (Blockade) కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయకూడదనే నిబంధనకు కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరుపక్షాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేసి వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమయంలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తిరిగి తెరవనున్నట్లు సమాచారం.
దీని ద్వారా ఇరాన్ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఎగుమతులు కొనసాగించే అవకాశం లభిస్తుంది. ఈ చర్య ప్రపంచ చమురు సంక్షోభాన్ని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.







