IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్ల జాబితా ఖరారైంది. వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, చివరి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. దీంతో లీగ్ దశ ముగియగా, నాకౌట్ పోరాటాలకు రంగం సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో వేగంగా 73 పరుగులు రావడంతో స్కోరు భారీగా పెరిగింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 9 వికెట్లకు 175 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు.
రాజస్థాన్ విజయానికి జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 15 బంతుల్లో 32 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులకు 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతని ఆల్‌రౌండ్ షో ముంబై ఛేజింగ్‌ను దెబ్బతీసింది.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన నాలుగో జట్టుగా నిలిచింది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ ప్రకారం, క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ధర్మశాలలో మంగళవారం జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది.
ఎలిమినేటర్ మ్యాచ్ 27న ముల్లన్‌పూర్‌లో జరగనుంది. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ మే 29న జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు.







