Philippines Earthquake: సోమవారం వేకువజామున దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతం తీవ్ర భూకంప ప్రకంపనలతో కంపించిపోయింది. 7.8 తీవ్రత గల ఈ భూకంపం తీర నగరాల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. ముఖ్యంగా జనరల్ శాంటోస్ నగరం తీవ్రంగా ప్రభావితమైంది. సుమారు 7 లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న ట్యూనా ప్రాసెసింగ్ పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు కూడా ఈ భూకంప ప్రభావానికి గురయ్యాయి.
జనరల్ శాంటోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కొంత మేర దెబ్బతిన్నట్లు సమాచారం. శాస్త్రవేత్తల ప్రకారం, భూకంప కేంద్రం జనరల్ శాంటోస్‌కు నైరుతి దిశగా సుమారు 8 మైళ్ల దూరంలో, భూమికి 6.2 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. తక్కువ లోతులో భూకంపం సంభవించడంతో దాని ప్రభావం మరింత తీవ్రంగా అనిపించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ భూకంపం అనంతరం సునామీ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఫిలిప్పీన్స్ తీర ప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే ఇండోనేషియా, మలేసియా తీరాల్లో 3 అడుగుల వరకు అలలు వచ్చే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తైవాన్, జపాన్, పపువా న్యూ గినియా వంటి దేశాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఫిలిప్పీన్స్ తీరంలో కొన్ని ప్రాంతాల్లో సుమారు 3 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. భూకంపం కారణంగా జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
Philippines Earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 7.8 తీవ్రతతో తీర ప్రాంతాల్లో కలకలం
-







