Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో జరిగిన పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేర్పిన విలువలనే తన పార్టీ సిద్ధాంతాలుగా పెట్టుకున్నానని ఆయన తెలిపారు. తనపై వచ్చిన విమర్శలు, బెదిరింపులపై స్పందిస్తూ పవన్ తీవ్రంగా మాట్లాడారు. భయపడి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని, “చచ్చిపోయేందుకు కూడా సిద్ధపడే పార్టీ పెట్టాను” అని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయత పేరుతో జాతీయ ఐక్యతను బలహీనపరిస్తే జనసేన అంగీకరించదని పవన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ వాదం పెరిగితే దేశ సుస్థిరత దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దక్షిణాదిలో పోటీ చేయలేరా అనే ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు.
మాపై విమర్శల వెనుక రేవంత్ రెడ్డి లేదా కేసీఆర్ ఉన్నారని తాను అనుకోనని ఆయన అన్నారు. 2029 ఎన్నికల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని, భాజపాతో పొత్తు విషయంపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు.
ఏపీ–తెలంగాణ మధ్య ఐక్యతకు చిహ్నంగా బూర్గుల రామకృష్ణారావు పేరు హైవేకు పెట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఆయన విగ్రహాన్ని హైవేపై ఏర్పాటు చేయాలని కూడా అన్నారు. తెలంగాణ విభజన తీరుపై మాత్రమే తనకు ఆవేదన ఉందని, తెలంగాణ ఏర్పాటుపై కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.







