APSRTC: బస్సు సేవల నాణ్యతను పెంచుతూ, సరికొత్త సాంకేతికతతో కూడిన వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ముందడుగు వేస్తోంది. కాలపరిమితి ముగిసిన, అధిక కిలోమీటర్లు ప్రయాణించిన పాత బస్సుల స్థానంలో కొత్త విద్యుత్ (ఎలక్ట్రిక్) మరియు సీఎన్‌జీ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మొత్తం 6,000 బస్సులను దశలవారీగా తీసుకురానుండగా, అందులో 5,500 ఎలక్ట్రిక్ బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులు ఉండనున్నాయి.
ప్రస్తుతం నడుస్తున్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సిటీ సర్వీసుల్లో పాత బస్సులను తొలగించి, వాటి స్థానంలో కొత్త విద్యుత్ బస్సులను అదే తరహా సేవలుగా నడపనున్నారు. ప్రయాణికులకు ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ప్రస్తుతం ఉన్న రంగులనే కొత్త బస్సులపై కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా, వాటిలో తొలి విడతగా 300 బస్సులు జులై నెలలో రోడ్లపైకి రానున్నాయి. మిగిలిన 450 బస్సులు ఆగస్టులో అందుబాటులోకి వస్తాయి. ఇవి రాష్ట్రంలోని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నడపబడతాయి.
తిరుమల ఘాట్ రోడ్లలో ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో ప్రత్యేకంగా 9 మీటర్ల పొడవు గల 300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా జీసీసీ విధానంలో మరో 1,450 ఎలక్ట్రిక్ బస్సుల సమీకరణకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
పూర్వోదయ పథకం ద్వారా రాష్ట్రానికి మరో 1,000 ఎలక్ట్రిక్ బస్సులు లభించనున్నాయి. అలాగే గ్రామీణ, దూర ప్రాంతాల్లో రవాణా సేవలను మెరుగుపరచేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,000 బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. సీఎన్‌జీ అందుబాటులో ఉన్న పట్టణాల్లో 500 సీఎన్‌జీ బస్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.







