Google AI data center: విశాఖపట్నంలో ఐటీ రంగానికి కొత్త దిశ చూపించే కీలక పరిణామం చోటుచేసుకుంది. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖ ఐటీ రంగంలో ప్రధాన కేంద్రంగా అవతరించనుంది.
మొత్తం రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో గూగుల్ మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇవి 1 గిగావాట్‌కు పైగా సామర్థ్యంతో నిర్మించబడతాయి.
2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో తర్లువాడలో నిర్మాణం ప్రారంభమవుతుంది. దీని కోసం తర్లువాడలో 266.6 ఎకరాలు, అడవివరం వద్ద 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 174.80 ఎకరాల భూమిని కేటాయించారు.
ఈ ఏఐ డేటా హబ్‌తో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి. సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా. నిర్మాణ దశలోనే 60 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత విశాఖ ఆసియాలో గూగుల్ క్లౌడ్ మరియు సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్‌కు కీలక గేట్‌వేగా మారనుంది.







