Uttar Pradesh Fire Accident: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పురనియా ప్రాంతంలోని భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి కాలిన గాయాలు అయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖల సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. భవనంలో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినప్పటికీ, కొందరు ప్రాణభయంతో పై అంతస్తుల నుంచి దూకినట్లు తెలుస్తోంది. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కోచింగ్ సెంటర్‌తో పాటు గేమింగ్ జోన్ కూడా ఉండటంతో ఘటన సమయంలో అక్కడ విద్యార్థులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
మంటలు వేగంగా వ్యాపించడంతో కొంతమంది బయటపడలేక చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. లక్నోలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన ఆయన, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని పోలీసు, అగ్నిమాపక శాఖలతో పాటు స్థానిక యంత్రాంగానికి సూచనలు జారీ చేశారు.







