Telangana: తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి రాష్ట్రానికి రూ.9,968 కోట్ల గ్రాంట్‌ను ప్రకటించింది.
ఈ నిధులను పూర్తిగా గ్రామీణ అభివృద్ధి పనులకే వినియోగించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు లేదా ఇతర పరిపాలనా ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించరాదని కఠిన ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, గ్రామీణ రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రజా అవసరాల పనులకే ఈ నిధులు ఖర్చు చేయాలని పేర్కొంది.
నిధుల వినియోగంలో పారదర్శకత ఉండేందుకు కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి స్థానిక సంస్థ తమ ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. త్రైమాసిక, వార్షిక నివేదికలను స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఆడిట్‌లో ఎలాంటి లోపాలు బయటపడినా వెంటనే సరిదిద్దాలని, అక్రమాలు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల కోసం మొత్తం రూ.4,35,236 కోట్లను ఆర్థిక సంఘం కేటాయించింది.
ఇందులో 80 శాతం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు, 10 శాతం మండల ప్రజా పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా ప్రజా పరిషత్‌లకు విడుదల చేయనున్నారు.
ప్రతి సంవత్సరం జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా నిధులను విడుదల చేస్తారు. అయితే మొత్తం నిధుల్లో 20 శాతం భాగం స్థానిక సంస్థల పనితీరు ఆధారంగా ఇవ్వనున్నారు. పన్నుల వసూళ్లు, స్వంత ఆదాయ వనరుల పెంపు వంటి అంశాలను ప్రామాణికంగా పరిగణించనున్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పది పనిదినాల్లోగా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది.
మొదటి విడత నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వివరాలు, 2025-26 ఆడిట్ నివేదికలను సమర్పించాలి. అలాగే ఎన్నికలు పూర్తై ప్రజాప్రతినిధులు ఉన్న స్థానిక సంస్థలకే ఈ గ్రాంట్లు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. గ్రామసభలు, పరిషత్ సమావేశాల్లో నిధుల వినియోగంపై తీర్మానాలు ఆమోదించి, వాటిని ఇ-గ్రామ్‌స్వరాజ్ వేదికలో నమోదు చేయడం తప్పనిసరి చేసింది.







