RTO services: తెలంగాణ వ్యాప్తంగా RTOలలో ఆన్‌లైన్ సేవలు ఒక్కసారిగా అంతరాయం కలగడంతో వాహనదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉపయోగిస్తున్న ‘వాహన్ సారథి’ సాఫ్ట్‌వేర్ సర్వర్లు సాంకేతిక లోపం కారణంగా పూర్తిగా పనిచేయకపోవడంతో డ్రైవింగ్ లైసెన్సులు, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, వాహన బదిలీలు వంటి కీలక సేవలు నిలిచిపోయాయి.
సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. తమ పనుల కోసం వచ్చిన వందలాది మంది వాహనదారులు కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిస్టమ్ ఎప్పుడు తిరిగి పనిచేస్తుందో తెలియక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సాంకేతిక సమస్యపై స్పందించిన రవాణా శాఖ ఉన్నతాధికారులు కేంద్ర సర్వర్లలో ఏర్పడిన లోపం కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయని వెల్లడించారు. సర్వర్ రికవరీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మరికొద్దిసేపట్లో ‘వాహన్ సారథి’ సేవలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు వాహనదారులు సహకరించాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.







