West Bengal CM: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి(Suvendu Adhikari) ఎంపికైనట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం మే 9న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవనున్నట్లు సమాచారం. సువేందుతో పాటు మరో ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సువేందు అధికారి గణనీయమైన పాత్రను పోషించారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించిన ఆయన, తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో కూడా దీదీపై విజయం సాధించారు.
మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 207 సీట్లు గెలుచుకోగా, తృణమూల్ కాంగ్రెస్ 80 సీట్లకే పరిమితమైంది. ఈ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చారిత్రక ఆధిక్యం సాధించినట్లైంది.







