భారత ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ రాజధాని రోమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ(PM Giorgia Meloni)ని కలుసుకుని ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. డిన్నర్ అనంతరం ఇద్దరు నేతలు రోమ్‌లోని ప్రసిద్ధ కొలోసియం వద్ద కలిసి నడిచారు. ఈ సందర్శనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోడీ, జార్జియా మెలోనీకి మా దేశంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే “మెలోడీ చాక్లెట్”(Melody chocolate )ను బహుమతిగా ఇచ్చారు.
ఈ చిన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మెలోనీ స్పందిస్తూ సరదాగా వీడియోను ఎక్స్ (Twitter)లో షేర్ చేశారు. “ప్రధాని మోడీ ఇచ్చిన మంచి టాఫీ – మెలోడీ” అని వ్యాఖ్యానించడం నెటిజన్లను ఆకట్టుకుంది.
మోడీ, మెలోనీ పేర్ల కలయికతో ఏర్పడిన “మెలోడీ” అనే పదం గతంలో కూడా వైరల్ కాగా, ఇప్పుడు ఈ చాక్లెట్ గిఫ్ట్‌తో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మెలోనీ రోమ్‌కు మోడీ చేరుకున్న వెంటనే “రోమ్‌కు స్వాగతం నా మిత్రమా!” అంటూ ఆత్మీయంగా ఆహ్వానించారు.
ఈ పర్యటనలో ఇరువురు నేతలు భారత్–ఇటలీ సంబంధాలు, వాణిజ్యం, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.







