MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే నాయకుడు ఎం.కే. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఎదుర్కొన్న ఓటమిపై ఆయన స్పందిస్తూ, విజయం కూడా తమకు కొత్త కాదని, ఓటమి కూడా కొత్త అనుభవం కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వెల్లడించారు.
డీఎంకే ఇప్పటివరకు ఆరు సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తుచేసిన స్టాలిన్, ఈ రాజకీయ ప్రయాణంలో గెలుపు-ఓటములు రెండూ ఎదురయ్యాయని చెప్పారు.
అయితే సిద్ధాంతాలకు విరుద్ధంగా మారకుండా ఉండటం అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగే వారే నిజమైన కార్యకర్తలని ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
డీఎంకే మరియు టీవీకే మధ్య ఓట్ల తేడా కేవలం 3.52 శాతమేనని స్టాలిన్ తెలిపారు. తమిళ ప్రజలు తమపై బలమైన నమ్మకం ఉంచారని, ప్రతి ఓటును ఆ విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నానని చెప్పారు.
అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సేవ చేస్తామని, విపక్షంలో ఉన్నప్పుడు ప్రజల హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనైనా తమ రాజకీయాలు ప్రజల కోసమే కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
73 ఏళ్ల స్టాలిన్ ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ, ఈసారి కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 9 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు.







