Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంసానుకూలంగా స్పందించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ప్రాజెక్టును టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో, రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన భాగస్వామ్యంతో 50:50 నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించి ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడం, నగర అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా మెట్రో విస్తరణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు.
ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, త్వరలోనే తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌కు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.
మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్ లభించడం ద్వారా నగర ప్రజలకు భవిష్యత్తులో మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
-







