Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై ఉన్న భారీ రుణభారాన్ని తగ్గించేందుకు రూ.13,600 కోట్ల విలువైన రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా మెట్రో ఆర్థిక స్థిరత్వం మరింత బలపడనుంది. దీర్ఘకాలంలో వడ్డీ భారాన్ని తగ్గించి నిర్వహణ వ్యయాన్ని సులభతరం చేయనుంది. దీంతో హైదరాబాద్ మెట్రో భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు కూడా మార్గం సుగమం కానుంది.
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC)తో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఈ కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో IRFC సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో హైదరాబాద్ మెట్రో నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇప్పటివరకు లార్సెన్ అండ్ టూబ్రో (L&T) అధీనంలో ఉన్న ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ యొక్క 100 శాతం యాజమాన్య హక్కులు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి. దీంతో హైదరాబాద్ మెట్రో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చి ప్రజా ఆస్తిగా మారనుంది. ఈ రీఫైనాన్సింగ్ నిధులను నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు మరియు వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్ కోసం వినియోగించనున్నారు.
ఈ రుణ సౌకర్యం 20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో ఉండనుంది. దీంతో నెలవారీ వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సడలింపుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ ప్రణాళికలకు మరింత వేగం లభించనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
మెట్రో కనెక్టివిటీ పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.







