Bharat Taxi: రవాణా రంగంలో సహకార మోడల్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ సేవల విస్తరణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రానున్న రెండేళ్లలో దేశంలోని 500కు పైగా నగరాలు, పట్టణాలకు ఈ సేవలను విస్తరించే ప్రణాళిక సిద్ధమైందని ఆయన వెల్లడించారు.
గుజరాత్లో భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన అమిత్ షా, రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో టూ వీలర్, ఆటో రిక్షా, ఫోర్ వీలర్ విభాగాల్లో సేవలు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సేవలను ఇకపై పూర్తిస్థాయిలో విస్తరించనున్నట్లు చెప్పారు. విస్తరణలో తొలి దశగా జులై 31లోపు నాగ్‌పూర్, పుణే, ముంబై, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్‌కతా నగరాల్లో భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయని ఆయన వివరించారు. అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా మరిన్ని నగరాలకు ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకెళ్లే ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ సేవలో డ్రైవర్లు కేవలం వాహన యజమానులు లేదా భాగస్వాములు మాత్రమే కాకుండా సహకార సంస్థ సభ్యులుగా కొనసాగుతారని అమిత్ షా తెలిపారు. ఇప్పటికే సుమారు ఏడు లక్షల మంది డ్రైవర్లు ఈ ప్లాట్ఫామ్లో సభ్యులుగా చేరినట్లు వెల్లడించారు. సహకార వ్యవస్థ ద్వారా డ్రైవర్ల ఆదాయం, భద్రత, సామాజిక గుర్తింపు పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన “సహకారం ద్వారానే సమృద్ధి” అనే భావనకు అనుగుణంగానే భారత్ ట్యాక్సీని అభివృద్ధి చేస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో రవాణా రంగంలో సహకార విధానానికి ఇది కొత్త దిశను చూపుతుందని, భవిష్యత్తులో భారత్ ట్యాక్సీ దేశవ్యాప్తంగా కీలక మొబిలిటీ నెట్‌వర్క్‌గా ఎదుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Bharat Taxi | ఉబెర్, ఓలా తరహాలో ‘భారత్ ట్యాక్సీ’.. దేశవ్యాప్తంగా సేవలు, అమిత్ షా కీలక ప్రకటన
-







